Sunday 26 January 2014

నాగాలిపటం

గాలిపటం చూడరా , గాలిలోన ఎగురురా
దారం కట్టి వదలరా , దాని గొప్ప చూడరా
ఎర్రరంగు గాలిపటం , ఎగురుతుంది చూడరా
రెక్కలేమో లేవురా , పక్షి వలె ఎగురురా
తోక ఉంది చూడరా , కోతి మాత్రం కాదురా
తాడు లాగి వదలరా , పల్టీలు కొట్టును చూడరా

ఎవరెవరు

ఎండ ఇచ్చేది ఎవరు ? సూర్యుడు సూర్యుడు !
వాన ఇచ్చేది ఎవరు ? మబ్బులు మబ్బులు !
వెన్నెల ఇచ్చేది ఎవరు ? చంద్రుడు చంద్రుడు !
గాలి ఇచ్చేది ఎవరు ? ఆకాశం ఆకాశం !
ప్రేమ ఇచ్చేది ఎవరు ? అమ్మా నాన్న గురువూ !

దిక్కులు

తూర్పు పడమర , ఎదురెదురు
నింగి నేల , ఎదురెదురు
ఉత్తరం దక్షణం , ఎదురెదురు
నీవు నేను , ఎదురెదురు 

ఏనుగమ్మఏనుగు

ఏనుగమ్మఏనుగు , ఎంతో పెద్ద ఏనుగు
చిన్ని కళ్ళ ఏనుగు ,  నాలుగు కాళ్ళ ఏనుగు
చిన్న తోక ఏనుగు , చేట చెవుల ఏనుగు
తెల్ల కొమ్ముల ఏనుగు , పెద్ద తొండం ఏనుగు
దేవుని గుళ్ళో ఏనుగు , దీవనలిచ్చే ఏనుగు 

గడియారం

గోడమీద గడియారం
చూడు మనకు చెపుతుంది
కాలమెంతో విలువైనది
గడియ వృధా చేయవద్దన్నది 

ఉన్న ఊరు

ఉన్న ఊరు విడిచి , ఉండనే ఉండలేము
కన్నా తల్లిని విడిచి అసలే ఉండలేము
ఉన్న ఊరేనాకు చెన్న పట్నమమ్మా
కన్నతల్లే నాకు కల్ప వృక్షమ్ము  

జ్ఞానేంద్రియాలు

ముక్కు ఎందుకున్నదీ , గాలి పీల్చుటకు ఉన్నది
నాలుక ఎందుకున్నదీ , రుచిని తెలుపుటకు ఉన్నది
చర్మం ఎందుకున్నది , స్పర్శ తెలుపుటకు ఉన్నది
చెవులు ఎందుకున్నవి , అన్నీ వినుటకు ఉన్నవి
కళ్ళు ఎందుకున్నవి , అన్నీ కనుటకు ఉన్నవి
అన్నీ కలిపి ఈ అయిదు ఏమందురు , జ్ఞానేంద్రియాలు అందురు .. 

చిన్నారి సైకిల్

చిన్నదమ్మా చిన్నది, చిన్న సైకలు కొన్నది
రోడ్డు మీదకి వెళ్ళింది కాలు జారి పడింది
ఆసుపత్రిలో చేరింది ఇంటి దగ్గరకి వచ్చింది
మల్లి సైకలు ఎక్కింది సైకలు బాగా తొక్కింది  

తెలుగు తల్లికి జేజేలు

జేజేలమ్మ జేజేలు భారతమాతకు జేజేలు
జేజేలమ్మ జేజేలు తెలుగు తల్లికి జేజేలు
అమ్మా నాన్నకు జేజేలు , గురువుకు జేజేలు
సూర్య చంద్రులకు జేజేలు , పుడమి తల్లికి జేజేలు
వరుణ దేవునికి జేజేలు , వాయు దేవునికి జేజేలు
తెలుగువారికి జేజేలు , తెలుగు తల్లికి జేజేలు

చింతకాయ

చిమడకే చిమడకే ఓ చింతకాయ
నువ్వెంత చిమిడినా నీ పులుపు పోదు 

కోడి

కోడి కోడి రావే , రంగుల కోడి రావే
ఇదిగో బుట్ట చూడవే , ధాన్యమున్నది తినవే
పొడిచి పొడిచి తినవే , పొట్టనిండా తినవే
మంచినీళ్ళూ తాగవే , తెల్లని గుడ్డు పెట్టవే  

గాంధీ తాత

నున్నని గుండు , సన్నని ముక్కు
కళ్ళకు జోడు , చేతిలో కర్ర
చిన్ని పిలక , పరుగుల నడక
బాలల తాత , భారత నేత
ఎవరు ? ఎవరు ? మన గాంధీ తాత 

బొమ్మా

బొమ్మా బొమ్మా బొమ్మా , రెండు చేతుల బొమ్మా
బొమ్మా బొమ్మా బొమ్మా , రెండు కాళ్ళ బొమ్మా
బొమ్మకు రెండు కళ్ళు , నోటి నిండా పళ్ళు
సుందరాంగి పెళ్ళీ , చూసి వద్దాం రండి
చుక్కల చుక్కల చీర , వెండి అంచు చీర
అయిదు వందలు అప్పు , చెప్పుకుంటే తప్పు 

ఎన్నో రంగులు

కాకి కోకిల నల్లన , నేరేడు పండు నల్లన
ఆవు పాలు తెల్లన , పాపాయి పళ్ళు తెల్లన
కుంకుమ తిలకం ఎర్రన , చిలకమ్మా ముక్కు ఎర్రన
చామంతి బంతి పచ్చన , కాళ్ళకి పసుపు పచ్చన
ఆకాశలో మేఘం నీలం , సముద్రంలో నీళ్ళు నీలం
ఇదియే రంగుల వలయంరా
సృష్టి అంతయూ ఈ రంగుల మయమేరా  

చిలుకా చిలుకా

ఎగిరెద వెందుకు చిలుకా చిలుకా !
లోకం చూడగ కోరిక కనుకా !
పలికెద వెందుకే  చిలుకా చిలుకా !
ఊహలు చెప్పగ మనసగు కనుకా !
అలిగెద వెందుకే  చిలుకా చిలుకా !
కాయలు పండ్లు ఈయడు గనుకా !

కోకిలమ్మ

చెట్టు చెట్టుకు వాలతాను
పిట్ట పిట్టకు పలుకుతాను
కొంగ్రొత్త చిగురులు మేస్తాను
రంగైన పువ్వులు కోస్తాను
పుప్పొళ్ళు గుప్పిళ్ళు తింటాను
మత్తు తియ్యగా పాడతాను

జేజేలమ్మకు జేజేలు

అమ్మకు జేజేలు నాన్నకు జేజేలు
చదువులు నేర్పే గురువుకు జేజేలు
ఎండను ఇచ్చే సూర్యునికి జేజేలు
వెన్నెలనిచ్చే చంద్రునికి జేజేలు
వానల నిచ్చే మబ్బుకు జేజేలు
దాన్యము యిచ్చే భూదేవికి జేజేలు 

పువ్వులే పువ్వులు

బంతి పువ్వు , చేమంతీ పువ్వు
కల్వ పువ్వు , చెంగల్వ పువ్వు
మల్లె పువ్వు , సిరిమల్లె పువ్వు
జాజి పువ్వు , విరజాజి పువ్వు
వంగపువ్వు సంపెంగ పువ్వు
బీర పువ్వు , నేతి బీర పువ్వు
నిమ్మ పువ్వు , దానిమ్మపువ్వు 

కాళ్ళా గజ్జ

కాళ్ళా గజ్జ కంకాళ్ళమ్మ
వేగుల చుక్క వెలగామొగ్గ
మొగ్గాకాదు మోదుగ నీరు
నీరు కాదు నిమ్మల బావి
బావి కాదు బచ్చలి కూర
కూర కాదు గుమ్మడి పండు
పండు కాదు పాపాయి కాలు
కాలు తీసి కడగా పెట్టు 

చిలకను చూడు

చెట్టుమీద చిలక , చూడూ చూడూ
పచ్చని చిలుకని , చూడూ చూడూ
ఎర్రని ముక్కును చూడూ చూడూ
ముక్కున పండును చూడూ చూడూ
పండును కొరికెను చూడూ చూడూ
గటుక్కున మ్రింగెను చూడూ చూడూ
తుర్రుమని ఎగిరెను చూడూ చూడూ 

రుచులు

చెరకుగడ తీపి , చింతకాయ పులుపు
ఉప్పుకల్లు ఉప్పు , మిరపకాయ కారం
కాకరకాయ చేదు , పసరు పిందె వగరు
రుచులోయ్ రుచులు ఎన్నెన్నో రుచులు
ఆరు రుచులు ఇవియే పాప
అన్నీ తిని చూడర బాబు  

మాయదారి పిల్లి

మ్యావ్ మ్యావ్ పిల్లి మాయదారి పిల్లి
మ్యావ్ మ్యావ్ పిల్లి మీసాల పిల్లి
దొంగవలె ఇంటికొచ్చి
పాలు తాగి పెరుగు తిని
నేతి గిన్నె ఖాళీ చేసి
కండలన్ని కిందకి తోసి
కళ్ళు తెరచి ముసికొనును
పారిపోవు దొంగపిల్లి
మ్యావ్ మ్యావ్ పిల్లి మాయదారి పిల్లి
మ్యావ్ మ్యావ్ పిల్లి మీసాల పిల్లి

వారాల పాట

ఆదివారం నాడు అమ్మాయి పుట్టింది
సోమవారం నాడు సొంపుగా పెరిగింది
మంగళవారం నాడు మాటలే పలికింది
బుధవారం నాడు బుద్దులే నేర్చింది
గురువారం నాడు గురువుదరి చేరింది
శుక్రవారం నాడు శుభమంటూ రాసింది
శనివారం నాడు చక చక నడిచింది
అది చూసి మేమంతా ఆనందపడ్డాము  

అందరికి దండాలు

చిటికెన వ్రేలు చెల్లాయి
ఉంగరపు వ్రేలు బంగారం
నడిమి వ్రేలు నా అన్న
చూపుడు వ్రేలు నీకెసి
బొటన వ్రేలు బొట్టెట్టి
అయిదు వ్రేళు ఒక్కటిగా చేసి
చేయి చేయి అంటించి
దండం పెట్టు అమ్మనాన్నకు
దండం పెట్టు గురువు గార్లకు
దండం పెట్టు పెద్దలందరకు
దివించెదరూ మనలందరనూ

నెమలి

చక్కని నెమలి నేనూ
ఎన్నో ఆటలు ఆడతాను
మబ్బులు పట్టుట చూడగానే
పింఛము విప్పి ఎగిరెదను
చక్కగ నాట్యం చేసెదను
తకతై తకతై అని ఆడెదను 

కోతి బావ

కోతి బావ నీకు కాస్త కోపమేక్కువ
చిలిపి వాడు పలకరిస్తే చిందులేక్కువ
అరటి పండ్లు చూస్తే చాలు ఆకలెక్కువ
పిందెలన్ని త్రుంచి పెట్ట ప్రీతి ఎక్కువ
చిలిపి పనులు చేయుటలో గర్వమేక్కువ
కర్రపుల్ల చూడగానే కంపమెక్కువ
కన్నా బిడ్డలంటే నీకు ప్రేమ తక్కువ
గుణము ఎంచనేల కుదురు తక్కువ

ఏనుగు

ఏనుగమ్మ ఏనుగు ! - నాలుగు కాళ్ళ ఏనుగు
ఏ ఉరోచ్చింది ఏనుగు ? - మా ఉరోచ్చింది ఏనుగు
ఏం చేసింది ఏనుగు ? - నీళు తాగింది ఏనుగు
ఏనుగు ఏనుగు నల్లన , ఏనుగు కొమ్ములు తెల్లన
ఏనుగు మీద రాముడు , ఎంతో చక్కని దేవుడు

వానా వానా వల్లప్పా

వానా వానా వల్లప్పా
వాకిట తిరుగు చెల్లప్పా
వానా వానా వల్లప్పా
చేతులు చాచు చెల్లప్పా
తిరుగు తిరుగు తిమ్మప్పా
తిరగలేను నరసప్పా

రంగుల లోకం

మందారం ఎరుపు - గులాబీ ఎరుపు
మంకెన పువ్వు ఎరుపు - మావి చిగురు ఎరుపు
అన్నము తెలుపు - ఆవు పాలు తెలుపు
జాజి పూలు తెలుపు - చందమామ తెలుపు
కాటుక నలుపు - కోకిల నలుపు
బంతి పసుపు - చేమంతి పసుపు
బీరపువ్వు పసుపు - కాకరపువ్వు పసుపు

వారాల పాట

ఆటలూ పాటలూ - ఆదివారం
సోకులూ సొగసులు - సోమవారం
మాటా మంతీ - మంగళవారం
బుద్దులూ సుద్దులూ - బుధవారం
గుజ్జన గూళ్ళు - గురువారం
చుట్టాలు పక్కాలు - శుక్రవారం
సంతోషల సరదాలు - శనివారం

చేతి వేళ్ళ పాట

తిందాం తిందాం చిటికెన వేలు
ఎట్లా తిందాం ఉంగరం వేలు
అప్పు చేసి తిందాం మధ్య వేలు
అప్పెట్లా తీరుతుంది ? చూపుడు వేలు
ఉన్నాగదా నేను అన్నింటికీ మీకోసం
పొట్టివాణ్ణి గట్టివాణ్ణి అన్నది బొటన వ్రేలు

పిల్ల

అల్లరి చేసే పిల్లోస్తుంది
ముక్కు చెవులు రక్కేస్తుంది
అల్లరి మానీ పిల్లల్లారా
చల్లగా మెల్లగా కూర్చోండర్రా ... 

అరటి మొలిచింది

ఆదివారం నాడు - అరటి మొలిచింది
సోమవారం నాడు - సుడి వేసి పెరిగింది
మంగళవారం నాడు - మారాకు తొడిగింది
బుధవారం నాడు - పోట్టిగేల వేసింది
గురువారం నాడు - గుబురులో దాగింది
శుక్రవారం నాడు - పచ్చగా పండింది
శనివారం నాడు - చక చక గెల కోసి
అబ్బాయి అమ్మాయి - అరటి పండ్లివిగో
అందరికి పంచితిమి - అరటి అత్తములు 

పంచరంగులు

కొండలేమో నల్లన - కొంగలేమో తెల్లన
ఆకులేమో పచ్చన - చిలకమ్మా ముక్కు ఎర్రన
పంచరంగు లివియే - తెలుసుకో పాపాయి

ఉడుతా ఓ ఉడుతా

ఉడుతా ఉడుతా ఓ ఉడుతా !
దిగి వస్తావా మిఠాయి పెడతా !
చెట్లు ఎక్కడం ఎట్లాగో
గుట్టు విప్పి చెబుతావా !
కొమ్మల్లో తిరగాడమేట్లాగో
నెమ్మెదిగా వివరిస్తావా !

చిగురు కొమ్మన ఉంటావు
హఠత్తుగా దిగివస్తావా
చప్పుడు కొంచెం వినపడితే
చిటుక్కున తప్పుకుంటావు
ఆ చిట్కాలేవో చెబుతావా
చిటారు కొమ్మకు చేరెదను
మెళకువలన్ని చెబుతావా
లడ్డుమిఠాయి తినిపిస్తా

బుజ్జి మేక

బుజ్జి మేక బుజ్జి మేక ఎక్కడికెల్తివి ?
రాజుగారి తోటలోన మేత కెల్తిని .
రాజుగారి తోటలోన ఏమి చేస్తివి ?
రాణిగారి పూల చెట్లు సొగసు చూస్తిని .

పూల చెట్లు చూసి నీవు ఊరుకుంటివా ?
నోరూరగ పూల చెట్లు మేసివస్తిని
మేసి వస్తే నిన్ను భటులు ఏమి చేస్తిరి ?
భటులు వచ్చి నా కాళ్ళు విరగగోట్టిరి

కాలు విరిగిన నీవు ఊరుకోంటివా ?
మందుకోసం నేను డాక్టరింటికెల్తిని
మందు ఇచ్చిన డాక్టరుకు ఏమిస్తివి ?
చిక్కనైన తెల్లపాలు అందిస్తిని

ఉన్న పాలు డాక్టరికిస్తే యజమాని కేమిస్తావు ?
గడ్డి తినక ఒక పుట పస్తులుండి తీరుస్త
పస్తులుంటే నీకు నీరసం రాదా ?
పాడు పని చేయనింక బుద్ధి వచ్సెనాకు 

అవ్వ - పిల్లి

అవ్వ ఇంటికి కాపలా - కర్ర పట్టుకున్నది
పిల్లి ఒకటి వచ్చింది - ఉట్టి పైకి ఎగిరింది
కావలున్న ముసలవ్వ - కర్ర తీసి విసిరింది
పాల కుండ పగిలింది - పిల్లి జారిపోయింది
అవ్వ అందుకేడ్వటం - తాత చూసి నవ్వటం

చిలకమ్మా పలుకమ్మ

చిట్టి చిలకమ్మా- పలుకు పలుకమ్మ
ఆ అవ్వ గువ్వమ్మ - నీవు గూడు కట్టమ్మ
కోడి పెట్టమ్మ - గూడు పెట్టమ్మ
పావురాయమ్మ - పాపకియ్యమ్మ
పాప చేతిలో ఉందమ్మ - పంచదార చిలకమ్మా

బావ బావ పన్నీరు

బావ బావ పన్నీరు - బావని పట్టుకు తన్నేరు
వీధి వీధి తిప్పేరు - వీసెడు గంధం పూసేరు
చావిడి గుంజకు కట్టేరు - చప్పిడి గుద్దులు గుద్దేరు
కాళ్ళపీట వేసేరు -  కడుపులో గుద్దులు గుద్దేరు
పట్టేమంచం వేసేరు - పాతిక  గుద్దులు గుద్దేరు
నులక మంచం వేసేరు  - నూరు గుద్దులు గుద్దేరు

బడాయి పిల్లి

బడాయి పిల్లి లడాయి కెళ్ళి
మిడతను చంపి ఉడుత అన్నది
ఉడుతను చంపి ఉడుం అన్నది
ఎలుకను చంపి ఏనుగు అన్నది
సింహం తానని పొంగిన పిల్లి
కుక్కను చూచి ఒకటే పరుగు

నా గాలిపటం

ఎగిరింది ఎగిరింది - నా గాలిపటం
గాలిలో ఎగిరింది - నా గాలిపటం
పైపైకి ఎగిరింది - నా గాలిపటం
పల్టీలు కొట్టింది - నా గాలిపటం
రంగురంగులదండి - నా గాలిపటం
రాజ్యాలు దాటింది - నా గాలిపటం
మబ్బుని తాకింది - నా గాలిపటం
పందెమే గెలిచింది - నా గాలిపటం

చిట్టి చిట్టి మిరియాలు

చిట్టి చిట్టి మిరియాలు - చెట్టుకింద పోసి
పుట్టమన్ను తెచ్చి - బొమ్మరిల్లు కట్టి
రంగులన్నీ వేసి - తెల్ల ముగ్గు పెట్టి
బొమ్మరింట్లో నీకు - బిడ్డ పుడితేనూ
బిడ్డ నీకు పాలు లేవు - పెరుగులేదు
కలవారింటికి - చల్ల కోసం వెళ్ళితే
అల్లం వారి కుక్క - భౌ భౌ మన్నది
నా కాళ్ళ గజ్జలు - ఘల్ ఘల్ మన్నవి
పుట్టలో పాము - బుస్ బుస్ మన్నది
చెట్టు కింద పిట్ట - కిచ కిచ మన్నది
చంకలో పాపాయి - కేర్ కేర్ మన్నది  

బుర్రు పిట్ట

బుర్రు పిట్ట బుర్రు పిట్ట తుర్రుమన్నది
పడమటింటి కాపురం చేయనన్నది
అత్త తెచ్చిన కొత్త కోక కట్టనన్నది
మామ తెచ్చిన మల్లె మొగ్గ ముడవనన్నది
మొగుని చేత మొట్టికాయ తింటానన్నది

చిట్టి చీమ

చిట్టి చీమ చిట్టి చీమ ఎక్కడికెళ్ళావు ?
చిట్టి పాప పుట్టిన రోజు విందుకెళ్ళాను.
విందుకెళ్ళి చిట్టి చీమ ఏమి చేసావు ?
చిట్టి పాప బుగ్గ పైన ముద్దుపెట్టాను.
ముద్దు పెట్టి చిట్టి చీమ ఏమి చేసావు ?
పొట్టనిండా పాయసం మెక్కివచ్చాను ....

చందమామ రావే

చందమామ రావే - జాబిల్లి రావే
కొండెక్కి రావే - గోగుపూలు తేవే
బండెక్కి రావే  - బంతిపూలు తేవే
తేరు మీద రావే  - తేనెపట్టు తేవే
పల్లకిలో రావే - పాలు పెరుగు తేవే
ఆడుకుంటూ రావే - అరటి పండు తేవే
అన్నింటిని తేవే  - మా అబ్బాయి కియ్యవే

మ్యావ్ మ్యావ్ పిల్లి

మ్యావ్ మ్యావ్ పిల్లి - పాలకోసం వెళ్లి
వంటగదికి మళ్లి - తలుపు చాటుకెళ్ళి
మూత తీసి తాగి - మూతి కాలె బాగా
అమ్మ వచ్చి చుచె - నడ్డి విరగగొట్టే

దాగుడుముతా

దాగుడుముతా దండాకోర్
పిల్లి వచ్చే ఎలుకా దాగే
ఎక్కడి దొంగలు అక్కడే
గప్ చిప్ ఫన్నీర్ బుడ్డి

నా కాళ్ళ గజ్జెలు

నా కాళ్ళ గజ్జెలు - మోకాళ్ళ చిప్పలు
అబ్బబ్బ నడుము  - అద్దాల రవికె
ముత్యాల హారం - కస్తూరి తిలకం
బిందె మీద బిందె  - బిందెలోన పెరుగు
పెరుగమ్మ పెరుగు - తిరుగమ్మ తిరుగు. 

ఒప్పుల కుప్పా - ఒయ్యారి భామా

ఒప్పుల కుప్పా - ఒయ్యారి భామా
సన్నా బియ్యం - చాయ పప్పు
బావిలో కప్పా - చేతిలో చిప్పా
రోట్లో తవుడు - నీ మొగుడెవరు ?
గూట్లో రూపాయి - నీ మొగుడు సిపాయి 

చిక్ చిక్ రైలు

చిక్ చిక్ రైలు వస్తుందీ
దూరం దూరం జరగండీ
స్టేషనులోనే ఆగింది
ఆగిన రైలు ఎక్కండీ
పచ్చలైటు చూసింది
కూతవేసి కదిలింది
జోజో పాపాయి ఏడవకు బొమ్మలు ఎన్నో కొనిపెడతా
లడ్డు మిఠాయితినిపిస్తా
కమ్మని కాఫీ తాగిస్తా.

చెమ్మ చెక్క

చెమ్మ చెక్క - చారడేసి మొగ్గ
అట్లు పోయ్యంగ - ఆరగించంగ
ముత్యాల చెమ్మచెక్క - ముగ్గులేయ్యంగ
రత్నాల చెమ్మచెక్క - రంగులేయ్యంగ
పగడాల చెమ్మచెక్క-  పందిరేయ్యంగ
పందిట్లో మా బావ - పెళ్లి చెయ్యంగ
సుబ్బారాయుడి పెండ్లి - చూచి వద్దాం రండి
మా వాళ్ళింట్లో పెండ్లి - మళ్లీ వద్దాం రండి